కలం, మెదక్ బ్యూరో : జిన్నారం మున్సిపల్ కమిషనర్ తీరుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా కమిటీ సమీక్షా సమావేశానికి హాజరైన ఎంపీ.. పటాన్ చెరు నియోజకవర్గంలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోందా? ఎమ్మెల్యేలు పోస్టింగులు ఇప్పిస్తున్నారని , అధికారులు కేవలం వారు చెప్పింది మాత్రమే వింటున్నారా?.. మీరు గవర్నమెంట్ దగ్గర పనిస్తున్నారా? ఎమ్మెల్యే దగ్గర పని చేస్తున్నారా? అంటూ జిన్నారం మున్సిపల్ కమిషనర్ ను నిలదీశారు.
నేషనల్ హెల్త్ మిషన్ కింద మూడు హాస్పిటల్ మంజూరు చెప్పిస్తే , కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే హాస్పిటల్స్ తనకు తెలియకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా చేస్తారని జిన్నారం కమిషనర్ పై మండిపడ్డారు. అయితే స్థానిక పటాన్ చెరు ఎమ్మెల్యే చెప్పాడని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో ఎంపీ మరింత ఆగ్రహించారు. ‘మీకు పోస్టింగ్ ఇప్పిస్తున్నారని ఆయన చెప్పినట్టు చేస్తున్నారా?, మీరు గవర్నమెంట్ లో పని చేస్తున్నారనే విషయం గుర్తుందా ?” అని కమిషనర్ ను ప్రశ్నించారు.
బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన జిన్నారం మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే ఉన్నతాధికారులకు సరెండర్ చేయాలని ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను గౌరవించని,ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా కమిటీ సమీక్షా సమావేశానికి ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మాణిక్ రావు, సంజీవ రెడ్డి తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.

