కలం, నిర్మల్ : శిశు మందిరాలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయాలు అని గోడం నగేష్ (MP Godam Nagesh) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను బుధవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 1967లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి శిశు మందిరంగా గుర్తింపు పొందిన ఈ పాఠశాల మళ్లీ పునఃప్రారంభం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. తాను కూడా శిశు మందిర్‌లో చదివి ఉంటే బాగుండేదని అనిపించేదని వ్యాఖ్యానించారు.
ఎందరో విద్యావంతులను తీర్చిదిద్దిన ఈ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజం, తల్లిదండ్రులు కోరుకునే నైతిక విలువలు కలిగిన విద్యను అందించడంలో శిశు మందిరాల పాత్ర కీలకమని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో ఆధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమైన ఈ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పాఠశాల పునఃప్రారంభానికి కృషి చేసిన పూర్వ విద్యార్థులు, దాతలను ఆయన అభినందించారు.

