కలం, నల్లగొండ బ్యూరో: కేంద్రం డీలిమిటేషన్ ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే కుదరదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఎంపీ చామల బుధవారం స్పందించారు. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు,మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతోందని, ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని, చర్చ జరిగినప్పుడు మల్లిఖార్జున ఖర్గే తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడు 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రోరెటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయనీ, పది రోజులు ఆగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి.? అని ప్రశ్నించారు ప్రోరేటా ప్రకారం 50 శాతం, రాష్ట్రాల ఆర్ధిక అభివృద్ధి ఆధారంగా 50 శాతం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారని తెలిపారు. దీనిపై ఐదు రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖలు రాశారని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 850 పార్లమెంట్ సీట్ల పెంపుదల కన్ఫ్యూజన్ గా ఉందని పార్లమెంట్ లో బలం ఉందని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 2026 జనగణనను పరిగణనలోకి తీసుకుంటారా లేదా స్పష్టం చేయాలని, మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

