Mobile Popup Ad
Mobile Popup Ad

మల్టీ విటమిన్ల అసలు నిజం.. షాకింగ్ విషయాలు చెప్పిన స్టాన్‌ఫోర్డ్ నిపుణులు

కలం, హెల్త్: నేటి జీవనశైలిలో వెల్నెస్ ట్రెండ్ పేరుతో చాలామంది మల్టీ విటమిన్లు (Multivitamins), సప్లిమెంట్లను వాడుతున్నారు. మరికొందరయితే ఇప్పుడన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వీటిని వాడుకోవాలని చెప్తారు. అయితే, ఈ మాత్రలు గుండె జబ్బులు, క్యాన్సర్ లేదా అకాల మరణం వంటి ప్రమాదాలను తగ్గించలేవని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధనలో తాజాగా వెల్లడైంది. సుమారు 4,50,000 మందిపై జరిపిన విశ్లేషణలో కూడా ఈ సప్లిమెంట్ల వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఏవీ లేవని తేలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇండస్ట్రీలో ఎన్నో చీకటి కోణాలు

స్టాన్‌ఫోర్డ్ శిక్షణ పొందిన వైద్యురాలు, దీర్ఘాయువు నిపుణురాలు డాక్టర్ హిల్లరీ లిన్ సోషల్ మీడియా వేదికగా ఈ పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెట్టారు. మార్కెట్‌లో లభించే చాలా ఉత్పత్తులు కేవలం ప్రకటనల ఆర్భాటమేనని ఆమె పేర్కొన్నారు. గతంలో తాను కూడా సప్లిమెంట్లు అవసరం లేదని, మంచి ఆహారం తింటే సరిపోతుందని భావించేదాన్నని, కానీ కొన్ని సందర్భాల్లో ఇవి అవసరమని ఇప్పుడు గుర్తిస్తున్నానని ఆమె వివరించారు. అయినప్పటికీ, ప్రపంచంలోని మొత్తం సప్లిమెంట్లలో కేవలం 0.1 శాతం మాత్రమే నిజంగా మేలు చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

పొంచి ఉన్న ముప్పు

సప్లిమెంట్ పరిశ్రమకు సంబంధించి ప్రజలకు తెలియని కొన్ని ముఖ్యమైన అంశాలను డాక్టర్ లిన్ వివరించారు. స్టోర్లలోకి వచ్చే సప్లిమెంట్లలో 90 శాతం వరకు ఎఫ్.డి.ఏ (FDA) నియంత్రణలో ఉండవు. సగటున ప్రతి వ్యక్తి నెలకు సుమారు 40 డాలర్ల కంటే ఎక్కువ డబ్బును నిరుపయోగమైన మాత్రల కోసం వృధా చేస్తున్నారు. కొన్ని అన్-రెగ్యులేటెడ్ ప్రీ-వర్కవుట్ సప్లిమెంట్లు శరీరానికి హాని కలిగిస్తాయి. చాలా ఉత్పత్తుల్లో భార లోహాలు (Heavy Metals) కలిసే అవకాశం ఉంది. హానికరం కాదని భావించే సప్లిమెంట్లు కూడా మనం వాడే ఇతర మందులతో వికటించవచ్చు లేదా అసలు అనారోగ్య సమస్యలను కప్పిపుచ్చవచ్చు.

సప్లిమెంట్లు మీ జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, కొన్నిసార్లు ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారతాయని డాక్టర్ లిన్ హెచ్చరించారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులలో ఏవి నిజంగా పని చేస్తాయి, ఏవి కేవలం భ్రమను కలిగిస్తాయి అనే విషయాన్ని గుర్తించడం చాలా అవసరమని ఆమె సూచించారు. అనవసరమైన మాత్రల కంటే విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడమే శ్రేయస్కరమని ఆమె స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>