కలం, ఖమ్మం బ్యూరో: వైకల్యం గెలుపునకు అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే లక్ష్యాల సాధన ముందు వైకల్యం చిన్నబోతుందని ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి పి.దేవి (Judge Devi) అన్నారు. ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలోని మానస జ్యోతి పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం విద్య, ఉపాధి రంగాల్లో ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు పొందవచ్చని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, సంకేత భాషా అనువాదకులు పాల్గొన్నారు.

