కలం, నల్లగొండ బ్యూరో: ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని, అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
విభజన హామీలు నెరవేర్చండి
వికసిత్ భారత్ లక్ష్యానికి తెలంగాణ రైజింగ్‌ను అనుసంధానం చేసి రాష్ట్రానికి సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని డిమాండ్ చేస్తూ, ఈ పర్యటనలో కొన్ని కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం తన వైఖరిని ప్రకటించాలని, భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు.
ఆ మూడు ప్రాజెక్టులకు సహకరించండి
ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు తెలపాలని పేర్కొన్నారు. మోదీ తనను తాను పెద్ద బీసీ నాయకుడిగా చెప్పుకుంటున్నారని, కానీ బీసీల సంక్షేమం పట్ల కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తీర్మానం చేసి, ఆర్డినెన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లుపై మోదీ స్పందించాలన్నారు. జనగణనలో కులగణన ఎందుకు చేపట్టడం లేదని, ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చలేదని ఆయన నిలదీశారు.
మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు
మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే 2026 జనాభా లెక్కల తర్వాతే వీటిని అమలు చేయాలనే డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతామని ఆయన వివరించారు.

