కలం, నల్లగొండ: “నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు” అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా స్పందించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఎంపీగా గెలిపించి, కేంద్ర క్యాబినెట్ మంత్రి స్థానంలో కూర్చోబెట్టారని.. మరి ఈ స్థాయికి తెచ్చిన రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. “మీరు పనులు చేస్తుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి?” అని ఆయన నిలదీశారు. తాను బీజేపీలోనే పుట్టానని, బీజేపీలోనే ఉంటానని కిషన్ రెడ్డి అంటున్నారని.. ఆయన ఏ పార్టీలో ఉంటారనే దాంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని చామల స్పష్టం చేశారు.
ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుంటే.. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేశారని చామల ప్రశ్నించారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేవలం ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం, హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరడంలో తప్పేముంది? దీనిపై కేంద్రం సహకరిస్తుందో లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు, అలాగే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం అందిస్తారా లేదా అనే దానిపై కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ కిషన్ రెడ్డి చెబుతున్న జాతకాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి పనుల్లో “కాళ్ళల్లో కట్టెలు పెట్టవద్దు” అని సీఎం రేవంత్ రెడ్డి అనడం ఎంతమాత్రం తప్పు కాదని, కేంద్రం అవలంబిస్తున్న ఈ ధోరణిని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి, తెలంగాణ ప్రయోజనాలపై కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.

