Mobile Popup Ad
Mobile Popup Ad

నెయ్‌మార్ ‘లాస్ట్ డ్యాన్స్’.. ఇదే చివరి ఫిఫా వరల్డ్ కప్?

కలం, స్పోర్ట్స్ : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ (Neymar) తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి కీలక సంకేతాలు ఇచ్చాడు. వచ్చే ఫిఫా వరల్డ్ కప్ 2026 తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ కావొచ్చని సూచిస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఫిఫా తన సోషల్ మీడియా ఖాతాలో నెయ్‌మార్ కెరీర్‌కు సంబంధించిన చిత్రాలతో “అతను ఎలా ఎదిగాడో మనం చూశాం” అనే సందేశాన్ని పోస్ట్ చేసింది. దీనికి స్పందించిన నెయ్‌మార్ “ది లాస్ట్ డ్యాన్స్” అంటూ కామెంట్ చేశాడు. దీంతో 2026 ప్రపంచకప్ అనంతరం అతడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

34 ఏళ్ల నెయ్‌మార్ బ్రెజిల్ తరఫున 128 మ్యాచ్‌లు ఆడి 79 గోల్స్ సాధించాడు. దేశ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే 2023 అక్టోబర్‌లో మోకాలి ACL గాయం కారణంగా అతడు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ గాయం తర్వాత వరుస ఫిట్‌నెస్ సమస్యలు నెయ్‌మార్‌ను వెంటాడుతున్నాయి. తాజాగా కాల్వ్ స్ట్రెయిన్ కారణంగా జూన్ 13న మొరాకోతో జరిగే బ్రెజిల్ తొలి మ్యాచ్‌కు కూడా అతడి అందుబాటు సందేహాస్పదంగా మారింది.

నెయ్‌మార్ 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టాడు. 2014లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో బ్రెజిల్ ఆశలన్నీ అతడిపైనే నిలిచాయి. అయితే కొలంబియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో వెన్నెముక గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు స్వర్ణ పతకం అందించి అభిమానుల మన్ననలు పొందాడు. కానీ 2018 ప్రపంచకప్‌లో గాయాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ టోర్నీలో బ్రెజిల్ క్వార్టర్‌ఫైనల్ దశలోనే నిష్క్రమించింది.

2023లో యూరోపియన్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన నెయ్‌మార్, ఫ్రాన్స్ క్లబ్ పీఎస్‌జీని విడిచి సౌదీ క్లబ్ అల్ హిలాల్‌లో చేరాడు. అయితే అక్కడ కూడా గాయాల కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పుడు 2026 ప్రపంచకప్‌ను “లాస్ట్ డ్యాన్స్”గా పేర్కొనడంతో, బ్రెజిల్ దిగ్గజం తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో నెయ్‌మార్ ప్రదర్శన ఎలా ఉంటుందన్నది ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>