కలం, యాదాద్రి భువనగిరి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి పరమైన శిక్షణ ఎంతో అవసరమని ఎంపీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (టీం సొసైటీ), మ్యాజిక్ బస్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. భువనగిరి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా, టీం సొసైటీ ఫండ్స్ నిధులతో 12 రోజులపాటు నిర్వహించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), ఇంటర్వ్యూ స్కిల్స్ శిక్షణా శిబిరానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , చాట్ జి.పి.టి పాత్ర ఎంతో కీలకమైనదని, ఇటువంటి అత్యాధునిక సాంకేతికతపై జిల్లా యువతకు ఉచితంగా శిక్షణ అందించడం అభినందనీయమని కొనియాడారు. నిరుద్యోగ యువత ఈ 12 రోజుల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని, ఇంటర్వ్యూ ,నైపుణ్యాలను నేర్చుకొని ఉద్యోగ సాధనలో ముందుకు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి , జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితి, ఆర్డీవో కృష్ణారెడ్డి, విద్యార్థులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

