Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ గూడేల్లో ఏ ఒక్క గుడిసె కనిపించొద్దు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని గూడేల్లో ఏ ఒక్క గుడిసె కనిపించొద్దని.. ఏ గూడెంలో ఇండ్లు లేని పేదలు ఉండకూడదని సీఎం రేవంత్ (CM Revanth) ఆకాంక్షించారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్ కు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడిగా ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని అన్నారు. రాష్ట్రంలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లతో పాటు గూడేల కోసం అదనంగా ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. గూడేల కోసం ప్రత్యేకంగా 21 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో లక్ష మంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారని ప్రకటించారు.

వచ్చే సంవత్సరం ఇదే రోజున అన్ని గూడేల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించుకుని పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు. గూడేల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పాత ఇందిరమ్మ ఇండ్లకు గోడలు బాగున్నా పైకప్పు పాడై కొందరు ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి స్లాబ్ వేసుకునేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని మంత్రికి సూచించారు. జిల్లా ప్రజలందరినీ చూస్తోంటే దసరా పండగకు వచ్చినట్లుగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. అందరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకోవాలని.. చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పారు. చదువొక్కటే పిల్లల జీవితాల్లో వెలుగులు తెస్తుందని.. అందరూ పిల్లల్ని చదివిస్తామని తనకు మాట ఇవ్వాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>