కలం, మక్తల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడల్లో విశేషంగా రాణించడం ద్వారా వారి భవిష్యత్తు బంగారు మయంగా మారుతుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీల (Mountain Cycling Competition) ను గురువారం మక్తల్ (Makthal) పట్టణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక రైల్వే బ్రిడ్జి పక్కన గల మట్టి రోడ్డులో 5 కిలోమీటర్ల మేర బాల బాలికలకు సైక్లింగ్ పోటీలను నిర్వహించి, ప్రతిభ కనబరిచిన బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 5, 6 తేదీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో జరిగే రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొత్తం 186 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ సూర్య ప్రకాష్, సిద్ధి లింగయ్య, రేణుక, అవంతి, స్వప్న, బాలమణి, త్రివేణి, నీలి యాదగిరి, పరశురాం, అనూష, నరేష్, రమేష్, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

