కలం, నిర్మల్ : వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సమష్టి కృషి అవసరమని ఎంపీ గోడం నగేష్ (MP Godam Nagesh) అన్నారు. మావల మండల కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో గురువారం ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను (Kisan Mela) జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో సుమారు 80 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు సంప్రదాయ సాగు విధానాలతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలన్నారు. ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, భూసారం, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఆయిల్‌పామ్‌తో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు ఎగుమతి అవకాశాలను మరింత విస్తరించాలని ఎంపీ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం ద్వారా ఉత్పాదకత పెంచి, సాగు ఖర్చులు తగ్గించి రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు విధానాలు, పంటల ఎంపిక, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ ఆత్మ చైర్మన్లు సంతోష్ రావు, రాజు, నారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, ఉద్యాన శాఖ అధికారి సందీప్ కుమార్, ఆర్డీఓ రాథోడ్ రవీందర్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

