కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati)లో మూడేళ్ల చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో పెళ్లికి అడ్డుగా ఉందని కన్న తల్లే పాపను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)కు రాజేష్ అనే వ్యక్తితో నాలుతగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె దుర్గ(3) ఉంది. ఆశాలత మనస్పర్థలతో తన భర్తతో విడిపోయి కూతురితో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఈ క్రమంలో ఎర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆశాలత అడ్డుగా ఉన్న చిన్నారిని హత్య చేసి స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చిపెట్టింది. అనంతరం ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆశాలత తల్లి తన బిడ్డ, మనవరాలు ఈనెల 19 నుంచి కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశాలతను గుర్తించి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈరోజు స్వర్ణముఖి నది సమీపంలో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం చేయనున్నారు.

