కలం, వెబ్‌డెస్క్: పంజాబ్ (Punjab) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను కొందరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… చండీగడ్‌కు చెందిన మంజీత్ కౌర్ (Manjeet Kaur) సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు గత నెల 3న సుభి, పిందా అనే ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి సెక్టార్ 34లోని మద్యం షాపు వద్దకు రావాలని పిలిచారు. ఈ ఇద్దరిలో ఓ వ్యక్తి మంజీత్‌కు ముందే పరిచయం ఉంది. యువతి అక్కడికి వెళ్లగానే ఇద్దరూ ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి మొరిండాకు తీసుకెళ్లారు.
మొరిండాలో యువతిని చెట్టుకు కట్టేసి ఆమెను చితకబాది, తర్వాత నిప్పించి వెళ్లిపోయారు. అటుగా వచ్చిన ఓ వ్యక్తి దుప్పటితో మంటలు ఆర్పి మంజీత్‌ను ఆసుపత్రికి తరలించాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంజీత్ కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె ఆగస్టు 5న స్పృహలోకి వచ్చి జరిగిన ఘోరాన్ని వివరించింది. అయితే పరిస్థితి విషమించడంతో చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
నిందితుల్లో ఒకరు మంజీత్‌తో గతంలో సహజీవనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై హత్య, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంజీత్ తల్లిదండ్రులు పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మంజీత్ కు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

