కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) లోని గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగలి సునీత రావు (Mogili Sunitha Rao) అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని సూచించారు. అలాగే పార్టీ క్రమశిక్షణపై ఆమె గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేస్తూ, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని ఆదేశించారు.
ఏఐసీసీ, పీసీసీ, టీఎంసీ పిలుపు మేరకు జరిగే ప్రతి కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పునరుద్ధరణ, గాంధీజీ పేరుతో పథకాల మార్పుపై చర్చ జరిగింది. ప్రతి జిల్లా నుంచి మంత్లీ యాక్టివిటీ రిపోర్ట్ సమర్పించడంతో పాటు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో తప్పనిసరిగా రీపోస్ట్ చేయాలని ఆదేశించారు.
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రియదర్శిని ఉడాన్ యోజన (Priyadarshini Udan Yojana) లో భాగంగా 33 జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేశారు. అలాగే ప్రతి జిల్లా నుంచి 200 మంది బాలికల వివరాలతో లిస్టు సిద్ధం చేసి, బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమాలను వెంటనే నిర్వహించాలని, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలని తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుందని, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల పేర్లను అందజేయాలని కోరారు.
Read Also : మైనార్టీలపై దాడుల్లో మత ప్రస్తావన లేదు : బంగ్లాదేశ్
Follow Us On : Twitter


