విదేశీ నిధుల నియంత్రణ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్: దేశంలో మరో సంచలన బిల్లు ఆమోదం దిశగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం సవరణ బిల్లు (FCRA Amendment Bill 2026)పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించాలని మోడీ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

తొలుత ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్లాన్ చేసినా.. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ప్రతిపక్ష నిరసనల మధ్య ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ముందుకు తీసుకురాకుండా బిల్లుపై సమగ్ర పరిశీలనకు సిద్ధమైంది.

ఇంకా రెండు రోజులే..

ఈ బిల్లు కంటే ముందే విద్యార్థులపై దాడి అంశంపై కేంద్రం చర్చకు సిద్ధమవుతోంది. సభలో సమగ్ర చర్చ తర్వాత విపక్షాల ప్రశ్నలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానమివ్వనున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ముగింపునకు ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో ప్రధాన పక్షం, ప్రతి పక్ష సభ్యుల మాటల తూటాలతో పార్లమెంట్ దద్దరిల్లనుంది. మంగళవారం సైతం పార్లమెంట్ ఆవరణలో ప్రధాన, ప్రతిపక్ష పార్టీల నిరసనతో ఉద్రిక్తల నెలకొన్న విషయం తెలిసిందే.

అక్రమ మత మార్పిడుల కట్టడే లక్ష్యం..

అయితే విదేశీ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన మోడీ సర్కార్.. ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించేలా ప్లాన్ చేస్తోంది. విదేశాల నుంచి వచ్చే నిధులు, గ్రాంట్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, దేశ భద్రత, పారదర్శకతలను కాపాడటానికే 2010 నాటి చట్టానికి సవరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. విదేశీ నిధులు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా అక్రమ మత మార్పిడులు, రాజకీయ కార్యకలాపాలకు వినియోగించకుండా నిరోధించడమే తమ ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.

బిల్లు పాస్ అవ్వాల్సిందే..

విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థల లైసెన్స్ రద్దయినా/ ఐదేళ్ల గడువు ముగిసి పునరుద్ధరణ జరగకపోయినా ఆ సంస్థలకు చెందిన విదేశీ నిధులు, ఆస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే డెసిగ్నేటెడ్ అథారిటీ స్వాధీనం చేసుకునేలా కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి అగ్రరాజ్యాలలోనూ విదేశీ నిధుల నియంత్రణకు ఇలాంటి కఠిన చట్టాలు ఉన్నాయని, భారత్ లోనూ ఈ బిల్లు పాస్ అవ్వడం తప్పనిసరి అని పేర్కొంటుంది.

బిల్లును ఖండిస్తోన్న కాంగ్రెస్..

ఈ బిల్లును జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు, పౌర సమాజ స్వయంప్రతిపత్తికి ముప్పు కలిగించే కఠిన చట్టం అని పేర్కొంటుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఈ చట్ట సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా మైనారిటీ విద్యా, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే స్వచ్ఛంద సంస్థలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఈ అస్త్రాన్ని వాడుతోందని ఆరోపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>