Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ లో కలకలం.. ఎగ్జామ్ హాల్లో ఫోన్ లభ్యం

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఒక సంచలన ఘటన వెలుగుచూసింది. కోర్టు ఉద్యోగాల అర్హత పరీక్షల్లో భద్రతా ఏర్పాట్లు ఎంత నామమాత్రంగా ఉన్నాయో తెలియజేసేలా ఓ ఘటన తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా ఓ అభ్యర్థి ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా అర్హత పరీక్షలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా, గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ పరీక్ష కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే, సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఒక అభ్యర్థి అధికారుల కళ్ళు గప్పి మొబైల్ ఫోన్‌తో నేరుగా ఎగ్జామినేషన్ హాల్‌లోకి ప్రవేశించాడు. ​పరీక్ష ముగియడానికి కేవలం మరో 10 నిమిషాల సమయం ఉందనగా… సదరు అభ్యర్థి తన ఫోన్ తీసి ప్రశ్నలకు సంబంధించిన జవాబులను ఇంటర్నెట్‌లో వెతుకుతూ ఇన్విజిలేటర్‌కు అడ్డంగా దొరికిపోయాడు. అప్రమత్తమైన ఇన్విజిలేటర్ వెంటనే అభ్యర్థి నుండి మొబైల్ ఫోన్, ప్రశ్నపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన కోర్టు ఉద్యోగాల పరీక్షల్లో ఉన్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, కేవలం నామమాత్రపు తనిఖీలు చేయడం వల్లే అభ్యర్థి ఫోన్ లోపలికి తీసుకెళ్లగలిగాడని తోటి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో ఒక పరీక్ష జరుగుతుండగా, మరోవైపు డీజే సౌండ్స్ పెట్టి విద్యార్థులు నృత్యాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తాజా మొబైల్ ఫోన్ కలకలంపై అటు కాలేజీ యాజమాన్యం కానీ, ఇటు పరీక్ష నిర్వాహకులు కానీ అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>