కలం, నకిరేకల్ : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, సామర్థ్య వృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం మాట్లాడుతూ.. గ్రామాల ప్రగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రహదారులు తదితర అత్యవసర ప్రజా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా, నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం భాగస్వామ్యంతో పనిచేస్తూ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

