కలం, నల్లగొండ బ్యూరో: పంటలు ఎండిపోవడంతో రైతుకు ఎకరాకు రూ. 40 వేల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు (Munugode) మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భజలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను గురువారం పరిశీలించి మాట్లాడారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ల ద్వారా రైతులు నీటిని తరలించి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. బ్రాహ్మణవెల్లెంల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని నెల్లికంటి సత్యం చెప్పారు.
ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుంచి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. మునుగోడు మండలంలోని కలువలపల్లి, పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు.

