పాలమూరులో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో రెండో విడతలో గుడిసెలలో నివాసం ఉంటున్న లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

అవినీతికి, దళారుల ప్రమేయానికి తావు లేదు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. పేదలకు గూడు కల్పించే ఈ బృహత్తర పథకంలో ఎలాంటి అవినీతికి, దళారుల ప్రమేయానికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం యూనిట్‌కు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని ఆయన వివరించారు.

లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా నగదు జమవుతుందని, నిర్మాణ దశలను బట్టి నిధులు విడుదలవుతాయని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత మొదటి విడత, తదుపరి నిర్మాణ దశల్లో రెండో విడత, స్లాబ్ పూర్తయ్యాక మరో విడత, నిర్మాణం తుది దశకు చేరిన వెంటనే ఆఖరి విడత సొమ్ము జమ అవుతుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ దశలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని, నిబంధనల ప్రకారం పని జరిగితే ఆటోమేటిక్‌గా నిధులు విడుదలయ్యేలా సాంకేతిక వ్యవస్థను తెచ్చామని వెల్లడించారు.

లంచం అడిగితే.. ఫిర్యాదు చేయండి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు విషయంలో లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు లేదా మధ్యవర్తులెవరైనా బిల్లులు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వెంటనే క్యాంపు కార్యాలయానికి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కులం, మతం, రాజకీయాలకు అతీతంగా కేవలం పేదరికమే ప్రామాణికంగా ఇందిరమ్మ కమిటీలు, అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గానికి మంజూరైన మొత్తం 5,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగానే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 3,000 నుంచి 4,000 ఇళ్లను అదనంగా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రజా పాలనకు మధ్య ఉన్న మార్పును, తేడాను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో డమ్మీ వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి, ఫాం హౌస్ లో పాలన చేశారని ఆయన మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బుద్దారం సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మహబూబ్ నగర్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నవనీత, మైత్రి యాదయ్య, ఎంపీడీఓలు కరుణ శ్రీ, యశోద, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, టంకర కృష్ణయ్య యాదవ్, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, అశ్వాక్, శ్రీశైలం యాదవ్, గోవింద్ యాదవ్, చెన్నయ్య, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ అధ్యక్షు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>