కలం, పెద్దపల్లి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Vijaya Ramana Rao) తెలిపారు. బుధవారం ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సదయ్య, అర్చకులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ ఆవరణలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ.. భక్తుల వసతి కోసం ఇప్పటికే గదుల నిర్మాణానికి భూమిపూజ చేశామని, జాతర ఆవరణలో వీఐపీల కోసం సకల సౌకర్యాలతో కూడిన అతిథి గృహాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆలయానికి వచ్చే ప్రధాన రహదారులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను ఆధ్యాత్మిక, వాస్తు నిపుణులు, స్థపతి, దేవాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు మొదటి వారంలో శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి ఓదెల మల్లన్న ఆలయ నిర్మాణ రూపకల్పనపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చీకట్ల మొండయ్య, సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, స్థానిక నాయకులు ఆళ్ల సుమన్ రెడ్డి, ఆకుల మహేందర్, బోడకుంట చిన్నస్వామి, గోపు నారాయణరెడ్డి, గోలి లింగారెడ్డి, బైరి రవిగౌడ్, రెడ్డి రజనీకాంత్, పుప్పాల శంకర్, బోంగోని శ్రీనివాస్, అంకం రమేష్, నీర్ల శ్రీనివాస్, పడాల రాజు, కుంచం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

