కలం, కరీంనగర్ బ్యూరో : పేదల ముఖాల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు (MLA Vijaya Ramana Rao) అన్నారు. పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం, బురహన్మియపేట గ్రామంలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం రూ.10 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్డులను ప్రారంభించారు. తదనంతరం నిర్వహించిన గ్రామ సభలో విజయరమణ రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పేద, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి ఇండ్లు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందన్నారు. వారికి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుడికి రూ.5 లక్షల సహాయం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేదల పక్షపాతి అని ఆయన కొనియాడారు. మొదటి విడతగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లలో నిర్మాణపు పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికీ మరో దశలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా మాదిరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకాన్ని జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు 500 బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు వివరించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ఆర్థిక సహాయం, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి వస్తాయని వెల్లడించారు. దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనలు పంపిణితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరవేసేలా ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కలిగినా సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. అయిల్ ఫాం సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని మంచి దిగుబడి వస్తుందని సూచించారు. వరి పంటకు మాత్రమే పరిమితం కాకుండా బీరకాయ, దొండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ వంటి పంటలతో పంట మార్పిడి ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నారని చింతకుంట విజయరమణ రావు (Vijaya Ramana Rao) చెప్పారు.
Read Also: ఢిల్లీలో రెచ్చిపోతున్న కుక్కలు.. 3 నెలల్లో 31 కుక్కకాటు ఘటనలు
Follow Us On : WhatsApp

