కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ.. రాళ్ల దాడితో రణరంగంగా మారిన ప్రాంతం

కలం మెదక్ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ (KCR Erravalli Farmhouse) ముట్టడికి కాంగ్రెస్‌ దళిత నాయకులు ఇచ్చిన పిలుపుతో సిద్దిపేట (Siddipet) జిల్లా మార్కుక్‌ మండలం దామరకుంట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వైపు నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరగా.. దామరకుంట వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు వారి కాన్వాయ్‌ను అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పరస్పరం ఇరు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.

ఇరువర్గాల మధ్య తోపులాట.. రంగంలోకి పోలీసులు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు అక్కడి పరిస్థితి తీవ్రంగా మారింది. రాళ్ల దాడితో పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర వాతావరణం కనిపించింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడి నేపథ్యంలో ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఉద్రిక్తత నేపథ్యంలో అదనపు బలగాలను కూడా మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>