కలం, యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరు (Motakondur) మండల కేంద్రంలో బీఆర్ఎస్లో (BRS) భారీగా చేరికలు జరిగాయి. మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. హరీశ్ రావుకు వంగపల్లిలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం భారీ బైక్ ర్యాలీతో మోటకొండూరు మండల కేంద్రానికి తరలివచ్చారు. అక్కడ నిర్వహించిన ర్యాలీలో హరీశ్ రావు పాల్గొని డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు సిరబోయిన మల్లేష్ యాదవ్, అనంతుల శోభన్ రెడ్డి, మెట్టు పద్మారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో సుమారు 2,000 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిని హరీశ్ రావు, గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్‌పై హరీశ్ రావు విమర్శలు
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు సర్వేల్లో కేసీఆర్ తిరిగి రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్ పతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి, సాగునీరు అందించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ నీటి వినియోగంపై కూడా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్యపై సవాల్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు పరిశీలించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇప్పుడు విద్యుత్ సరఫరాపై ఎందుకు పరిశీలించడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు సబ్స్టేషన్లకు వచ్చి విద్యుత్ సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ నిబంధన పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. పింఛన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా చర్యలు లేవని విమర్శించారు.
ప్రజల పక్షాన పోరాడుతాం
బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ పాలనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని తాము సవాల్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడవద్దని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగాలు ప్రజల సమస్యలపై పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. అందరూ కలిసి పనిచేసి భవిష్యత్తులో కేసీఆర్ పాలనను తిరిగి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

