కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారులను విస్తరించడమే లక్ష్యంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
పనుల సమయంలో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా విశాలమైన రహదారులు, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తేనే వనపర్తి పట్టణం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి అందరి బాధ్యత అని, రోడ్ల విస్తరణతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వ్యాపారులు పనులకు సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మాధవి ఎస్ఎల్ఎన్ రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, స్థానిక కౌన్సిలర్ రవి యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, పాకనాటి కృష్ణ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

