కలం, సారంగాపూర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) సూచించారు. సారంగాపూర్ మండలం ఆలూరు (Alur) గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 89 గోదాములు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇర్ల చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు ఇర్ల విజయ్, కుమ్మరి వెంకటేష్, ధని సర్పంచ్ బడి పోతన్న, తదితరులు పాల్గొన్నారు.

