చర్ల ఆసుపత్రిలో ఆపరేషన్ల సేవలు ప్రారంభం

కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు (MLA Tellam Venkata Rao) తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం భద్రాచలం ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌తో కలిసి చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన వైద్య పరికరాలను ప్రారంభించి, అందుబాటులోకి తీసుకొచ్చారు.

చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Charla PHC) రూ.5.6 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. చర్ల ఆసుపత్రిలో ఆపరేషన్ల సేవలు ప్రారంభం కావడం చుట్టుపక్కల ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. దీనివల్ల గిరిజన, గిరిజనేతర ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని, రానున్న రోజుల్లో చర్ల ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు ఆసుపత్రిలో రూ.53 వేల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ పరికరాలను సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>