మణుగూరు ఘటనపై డీఎఫ్‌వో కీలక వివరణ

కలం, ఖమ్మం బ్యూరో:  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) డివిజన్ పరిధిలో ప్రభుత్వ రిజర్వు అటవీ భూమి పరిరక్షణ, అటవీ పునరుద్ధరణ పనుల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై జిల్లా అటవీ అధికారి (DFO) శనివారం కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను రెండు వర్గాల మధ్య ఘర్షణగా లేదా సామాజిక వివాదంగా చిత్రీకరించడం సరికాదని, ఇది ప్రభుత్వ భూమి పరిరక్షణతో పాటు విధుల్లో ఉన్న అటవీ సిబ్బంది భద్రతకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

డీఎఫ్‌వో తెలిపిన వివరాల ప్రకారం, మణుగూరు డివిజన్‌లోని కంపార్ట్‌మెంట్ నెం.165లో సుమారు 20 హెక్టార్ల విస్తీర్ణంలో క్యాంపా (CAMPA–NPV) పథకం కింద అటవీ శాఖ మొక్కల పెంపక కార్యక్రమాన్ని చట్టబద్ధంగా చేపట్టింది. పనులు ప్రారంభించే ముందు స్థానికులతో సమావేశమై, వారి సమక్షంలోనే భూమి సరిహద్దులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి పనులు ప్రారంభమైనప్పటి నుంచి కొందరు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని, దీంతో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ నెల 17న యూనిఫాంలో విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిపై కొంతమంది మహిళలు పని ప్రాంతంలోకి ప్రవేశించి మహిళా సిబ్బందితో పాటు అధికారులపై ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరింత నష్టం జరగకుండా, సిబ్బంది ప్రాణభద్రత దృష్ట్యా ఆత్మరక్షణ కోసం మాత్రమే అటవీ సిబ్బంది ప్రతిస్పందించాల్సి వచ్చిందని డీఎఫ్‌వో వివరించారు. విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిలో అధిక శాతం మంది స్థానిక గిరిజన సమాజాలకు చెందినవారేనని, ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో వారికి ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వైద్య నివేదికలను దర్యాప్తు అధికారులకు అందజేస్తూ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను పోలీసు, రెవెన్యూ శాఖలు, స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుంటూ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించేందుకు అటవీ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ రిజర్వు అటవీ భూములను పరిరక్షించడం తమ ప్రాథమిక బాధ్యత అని డీఎఫ్‌వో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>