కలం, తెలంగాణ బ్యూరో: ప్రతి అపజయం భవిష్యత్తు విజయానికి పునాది అవుతుంది.. వైఫల్యాలు లేదా నిరాశలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు నేర్చుకున్న విలువలు జీవితాంతం మన వెంట ఉంటాయి.. మంచి అలవాట్లు, మంచి స్నేహాలు, సద్గుణాలు అలవరచుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Minister Mohammed Azharuddin) అన్నారు. విద్యార్థులు ప్రశ్నలు అడగడంలో ఎప్పుడూ సంకోచించవద్దని, తాను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్నప్పటికీ కోచ్‌లు, మెంటర్ల నుంచి నిరంతరం నేర్చుకున్నానని, జీవితాంతం నేర్చుకోవడమే విజయానికి మార్గమని ఆయన విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Arutla TPS)ను శనివారం ఆయన సందర్శించారు.
ఈ మేరకు మూడు గంటలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యంతో మమేకమయ్యారు. ఆయన పాఠశాలలోని విద్యా, వసతి సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతూ, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి, విద్య, క్రీడలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అనంతరం తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, భోజనశాలలు, క్రీడా మైదానాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి వసతులు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా కష్టపడి చదవాలని, పరస్పరం గౌరవించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. తమ తల్లిదండ్రులు, తెలంగాణ రాష్ట్రం దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. సీఎం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధునిక విద్యా సంస్థలను, అత్యుత్తమ విద్యా, క్రీడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులకు నాణ్యమైన తరగతి గదులు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, విశాలమైన క్రీడా మైదానాలు, క్రికెట్ ప్రాక్టీస్ సదుపాయాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు వంటి ప్రపంచ స్థాయి వసతులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విజయానికి మూలం అభిరుచి అని పేర్కొన్న మంత్రి, నిజమైన అభిరుచి ఉంటేనే కష్టపడి పనిచేయగలమని, చదువు, క్రీడలు లేదా ఏ రంగమైనా క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన విజయానికి మార్గమని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, సివిల్ సర్వెంట్, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్, క్రీడాకారుడు, నాయకుడు లేదా తనకు నచ్చిన ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రతి విద్యార్థికి గొప్ప బలమని పేర్కొంటూ, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని, వారి మాట వినాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ప్రతి విద్యార్థి భవిష్యత్తును నిర్మిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, అదనపు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

