కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు (Manuguru) పట్టణం పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ (Food poisoning) ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం విద్యార్ధినులు మటన్‌తో భోజనం చేయడం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురుకులంలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న హర్షిత, జలజ, రిషిత, భవ్య శ్రీ లకు ఫుడ్ పాయిజన్ అయి తీవ్రమైన అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్ధులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఫుడ్ పాయిజన్(Food poisoning) ఘటన గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateswarlu), ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాలికల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటన పై బాలికల తల్లి దండ్రులు, విద్యార్ది సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వసతి గృహాలలో అందించే ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఒక పక్క జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ విస్తృతంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

