కలం, వరంగల్ బ్యూరో: వర్దన్నపేట (Vardhanapeta) నియోజకవర్గంలో మొక్కజొన్న, వరి సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ (Hanumakonda) లోని కుడా సమావేశ మందిరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్లతో కలిసి సంబంధిత అధికారులతో మొక్కజొన్న, వరి సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి మొక్కజొన్నతో దిగుబడులు గణనీయంగా పెరిగాయని, రైతుల ఉత్పత్తులను సకాలంలో సేకరించి సరైన ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తెచ్చే మొక్కజొన్న, వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుల్లోని కవర్ షెడ్లలో భద్రపరచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిల్వ సదుపాయాలు, రవాణా, తూకం, చెల్లింపుల ప్రక్రియలు పారదర్శకంగా, వేగవంతంగా సాగాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, డీఆర్‌డీఓ మేన శ్రీను, వ్యవసాయ శాఖ అధికారులు, డీసీఓలు, మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులు ఏడీఓలు, తహశీల్దార్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

