కలం, గోదావరిఖని : 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (MLA Makkhan Singh Raj Thakur) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడంతో పాటు, దేశ అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధులు చూపిన దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

