కలం, మెదక్ బ్యూరో: సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) కొనియాడారు. మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీరంగూడ చౌరస్తాలో గల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కులం, మతం, వర్ణ వివక్షత లేని సమాజం కోసం అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి, అన్ని మతాలు ఒక్కటేనని, మనుషులు అందరూ సమానమేనని చాటిచెప్పిన గొప్ప అభ్యుదయ వాది అని అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతో.. కాయమే (శరీరం) కైలాసమని చాటి, శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారని అన్నారు. బసవేశ్వరుడు సూచించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం నియోజకవర్గం అధ్యక్షులు జగదీష్, సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.

