కలం, ఖమ్మం బ్యూరో : రాత్రింబవళ్లు శ్రమించి సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni ) ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత బొగ్గుగనుల అధికారుల సంఘం (ఐఎంఓఏ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం అధికారులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారి పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల పే-రివిజన్, అలవెన్సులు, ఇతర పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అలాగే సంస్థ సాధిస్తున్న లాభాల్లో అధికారులకు వాటా ఇవ్వడంతో పాటు, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సింగరేణి అధికారుల సమస్యలపై చొరవ చూపాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు వంగ వెంకట్, జె గట్టయ్య, కిష్టాఫర్ తదితరులు పాల్గొని అధికారుల దీక్షకు మద్దతు తెలిపారు.

