కలం మెదక్ బ్యూరో: వర్షాకాలం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) సూచించారు. చేగుంట మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులు, కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గ్రామాల పరిశుభ్రత, ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

