కలం, కరీంనగర్ బ్యూరో: ‘స్మార్ట్ సిటీ’గా ముస్తాబవుతున్న కరీంనగర్ నగరానికి దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ (Karimnagar Dumping Yard) సమస్య ఇప్పుడు అతిపెద్ద శాపంగా నగరవాసుల పాలిట మృత్యుపాశంగా మారింది. ఆటోనగర్ సమీపంలోని బైపాస్ రోడ్డులో మానేరు నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో మూడు దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలు ఇప్పుడు పర్వతాలను తలపిస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న చెత్త నిల్వలు, 2026 అక్టోబర్ నాటికి ఏకంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. తరలింపు మాట అటుంచితే ఒకవైపు పొగ, దుర్వాసనతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే.. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం పరిష్కారాన్ని మరింత జటిలం చేస్తోంది.
నరకయాతనలో కాలనీవాసులు..
డంపింగ్ యార్డ్ ప్రభావం కేవలం ఆటోనగర్ పరిసరాలకే పరిమితం కాలేదు. వేసవిలో చెత్తకుప్పల నుండి ఎగసిపడే మంటలు, దట్టమైన విషపూరిత పొగతో అల్కాపురి కాలనీ, అలుగునూర్, హౌసింగ్ బోర్డ్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వర్షాకాలంలో కుళ్ళిన చెత్త నుండి వచ్చే భరించలేని దుర్వాసన, దోమల బెడదతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీనికి తోడు మానేరు నదీ పరివాహక ప్రాంతానికి అత్యంత చేరువలో ఈ యార్డ్ ఉండటంతో వర్షపు నీటి ద్వారా విషపూరిత వ్యర్థాలు నదిలో కలిసి తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. హామీల విస్మరణ..
ప్రజా సమస్యగా మారిన ఈ అంశం ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ రణరంగంగా మారింది. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంశంగా మాచింది గత బీఆర్ఎస్ పాలనలో బయోమైనింగ్ పేరుతో రూ.16 కోట్లు ఖర్చు చేసినా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను కూడా తరలించకుండా కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు చెల్లించి చేతులు దులుపుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి అలసత్వం వల్లే నేడు 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, కేంద్రం నిధులు ఇచ్చినా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ప్రతిపక్షాల ఎదురుదాడి..
మున్సిపల్ ఎన్నికలకు ముందు మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లోనే డంపింగ్ యార్డును తరలిస్తామని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక సాకులు చెబుతున్నారని కమ్యూనిస్టులు, స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. గతంలో హుజురాబాద్ ప్రాంతానికి యార్డును తరలిస్తుంటే బీజేపీ నాయకులే అడ్డుకున్నారని, ఇప్పుడు ఇతరులు అడ్డుకుంటున్నారని బండి సంజయ్ మాట్లాడటం “దొంగే దొంగ అన్నట్లు… ఎగరలేక పందిరి గుంజ” అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
మారిన సమీకరణాలు..
కరీంనగర్ లో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత పాలనపై ఇద్దరూ విమర్శలు గుప్పిస్తూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నాయని ప్రకటించారు. అయితే ఈ కీలక కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గైర్హాజరు కావడం నగర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వంద కోట్ల ప్రణాళికలు.. ఆటంకాలెవరివి?
సమస్య పరిష్కారానికి భారీగా నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రాబోయే ఆరేడు నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగిస్తామని తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మరో రూ.80 కోట్లతో శాశ్వత ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పనులకు కొందరు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తూ కాంట్రాక్టర్లను భయపెడుతున్నారని, “గత పదేళ్లలో ఏమీ చేయని వారు ఇప్పుడు కాళ్లలో కట్టెలు పెడితే ప్రజలే తరిమికొడతారు” అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి బండి సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.
తరలింపుపై సందిగ్ధం.. రంగంలోకి కలెక్టర్..
డంపింగ్ యార్డును నగరం నుండి తరలించాలనే డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ ‘ఎక్కడికి తరలించాలి?’ అనే ప్రశ్నకు అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు. గతంలో హుజురాబాద్ మండలం సిర్సపల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించినా, స్థానిక గ్రామాల ప్రజల తీవ్ర నిరసనలతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. మరో రెండు, మూడు చోట్ల స్థలాలను పరిశీలించినా “మా ఊరి వద్ద చెత్త వద్దు” అనే నినాదంతో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఇటీవల క్షేత్రస్థాయిలో డంపింగ్ యార్డును పరిశీలించారు. తక్షణ చర్యలుగా ఫైర్ సేఫ్టీ చేపట్టాలని, ప్రత్యామ్నాయ స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మాకు కావాల్సింది రాజకీయాలు కాదు.. స్వచ్ఛమైన గాలి!
“పార్టీలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. వందల కోట్ల నిధులు వస్తున్నాయని చెబుతున్నారు.. కానీ మా ఇంటి పక్కనున్న చెత్త గుట్టలు మాత్రం కరగడం లేదు. ఏళ్ల తరబడి పొగ, దుర్వాసనతో చిన్నపిల్లలు, వృద్ధులు నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.” అంటూ డంపింగ్ యార్డు సమీప కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీల పరస్పర నిందారోపణల నడుమ తాము బలైపోతున్నామని నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థల మార్పిడిపై సందిగ్ధత ఉన్నందున. తక్షణమే ఆధునిక, శాస్త్రీయ పద్ధతుల్లో బయోమైనింగ్, వేస్ట్-టు-ఎనర్జీ చెత్తను పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేసి, తమకు ఈ నరకం నుండి శాశ్వత విముక్తి కల్పించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

