రీపాలిషింగ్ బియ్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని గోదాములలో ఉన్న టెండర్ బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా తరలించి రీ-పాలిషింగ్ చేస్తున్నారంటూ తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌లకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మిగిలిన బియ్యాన్ని టెండర్ ద్వారా దక్కించుకున్న కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా గోదాములలో ఉన్న దొడ్డు బియ్యాన్ని తరలించి, తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్‌గేట్ సమీపంలోని ఓ రైస్ మిల్లులో రీ-పాలిషింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

అర్ధరాత్రి వేళల్లో బియ్యం నిల్వలను తరలించి సంబంధిత రైస్ మిల్లులతో పాటు మరికొన్ని మిల్లుల్లో ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ, సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ విభాగం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టెండర్‌లో దక్కించుకున్న బియ్యాన్ని నిబంధనల ప్రకారం ఇథనాల్ తయారీ, పశుగ్రాసం వంటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా, వాటిని రీ-పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా పౌరసరఫరాల అధికారి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద నిల్వలను సీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రజేందర్, మ్యాక వినోద్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>