కలం మెదక్ బ్యూరో: సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (Civil Supplies Corporation) సంస్థలో జరిగిన అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు బలి అవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao ) ఆరోపించారు. నేడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దివాలా తీసిందని, ఆ సంస్థ NPA కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆయన అన్నారు. దొడ్డిదారిన కో-ఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్‌కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్‌కు డబ్బులు మళ్లించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారని విమర్శించారు. మెదక్ (Medak) జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యిందని , రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని హరీష్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా కండక్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదని, రైతులంటే చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి వచ్చిదన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే ఇవాళ వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారన్నారు. అంటే మీ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులం అంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

