కలం, కరీంనగర్ బ్యూరో: జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ జూనియర్ చెస్ పోటీలు కరీంనగర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar) విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా, మేధోశక్తిని, మానసిక దృఢత్వాన్ని పెంచే చెస్ వంటి క్రీడల వైపు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. చెస్ ఆటకు, జీవిత గమనానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. చదరంగంలో ఒక పావును తప్పుగా కదిపితే ఎలాగైతే ఆట ఓడిపోయే ప్రమాదం ఉంటుందో, జీవితంలో కూడా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉంది అని విద్యార్థులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకులు మైకేల్ శ్రీనివాస్, చెస్ అకాడమీ నిర్వాహకులు అనూప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను అకాడమీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

