ఆయిల్ కంపెనీలో ప్రభుత్వ విప్ ఆకస్మిక తనిఖీ!

కలం, యాదాద్రి భువనగిరి : బొమ్మలరామారం మండలం రంగపూర్ గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న టైర్లతో ఆయిల్ తయారు చేసే పరిశ్రమలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీలో భారీగా నిల్వ ఉంచిన పాత టైర్లను, అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కార్మికులకు ఎలాంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయిస్తుండటంపై ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కంపెనీ నిర్వహణకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి (పి సీ బి) ప్రభుత్వ అధికారుల నుంచి సరైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయమై రెండు, మూడు రోజుల్లో పూర్తి సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ముప్పు కలిగించే ఏ పరిశ్రమనూ ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అయిలయ్య (Beerla Ilaiah) హెచ్చరించారు.

తనిఖీ సమయంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ఈ కంపెనీ వల్ల స్థానిక ప్రజలకు, పర్యావరణానికి ఏవైనా కాలుష్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనే అంశంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి కంపెనీని నిర్వహిస్తున్నట్లు తేలితే, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కంపెనీని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>