కలం, మిర్యాలగూడ: ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) స్పష్టం చేశారు. “ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట” కార్యక్రమంలో భాగంగా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా రాత్రి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజల అవసరాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన నిన్న రాత్రి ఆ గ్రామంలోనే బస చేసి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఉదయం గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 16 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామ పర్యటనలో భాగంగా ప్రజల నుండి సేకరించిన వినతులను, సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజా సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పర్యటన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

