Mobile Popup Ad
Mobile Popup Ad

చినుకు రాలదు.. మొలక మొలవదు..!

క‌లం, నిర్మ‌ల్‌: వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా నిర్మల్ (Nirmal) జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు (Rains) కురవలేదు. జూన్ మాసంలో సాధారణంగా నమోదవాల్సిన వర్షపాతం కంటే ఇప్పటి వరకు సగానికి కూడా తక్కువగా నమోదవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 4.60 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా ఉంది. ఇందులో ప్రధానంగా పత్తి 1.70 లక్షల ఎకరాలు, వరి 1.40 లక్షల ఎకరాలు, సోయా 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 70 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

అయితే మృగశిర కార్తె ప్రారంభమైనప్పటి నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే కురవడంతో భూమిలో తేమ శాతం తగ్గిపోయింది. దీంతో రైతులు వేసిన పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాల్లో 50 శాతం కూడా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొలకెత్తిన చోట్ల కూడా ఎండల తీవ్రత కారణంగా మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు స్ప్రింక్లర్లు, బిందు సేద్యంతో నీటిని అందిస్తూ పంటలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.

వ్యవసాయ శాఖ అప్రమత్తం..

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ రైతులకు సూచనలు జారీ చేసింది. భూమిలో తేమ సరిపడా లేకపోతే విత్తనాలు వేయొద్దని, భారీ వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది. విత్తన రూపంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.

వర్షాల కోసం గ్రామాల్లో పూజలు..

వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా రైతులు వరుణదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో హనుమాన్ ఆలయాల్లో రోటి పండుగలు నిర్వహిస్తూ, కప్పతల్లి ఆటలు ఆడుతూ వర్షాలు కురవాలని ప్రార్థిస్తున్నారు. గ్రామదేవతలకు జలాభిషేకాలు చేస్తూ మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read Also: 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు పచ్చజెండా: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>