కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా దినోత్సవ కౌంట్ డౌన్ (Yoga Day Countdown) నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులు, యువత కూడా భారీ ఎత్తున హాజరయ్యారు. అందరూ పోటాపోటీగా యోగాసనాలు వేశారు. ఉదయాన్నే వేలాది మంది ప్రజలు ఒకేచోట యోగా చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ‘యోగ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం యోగా పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితంగానే జూన్ 21ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. యోగా గురువులు, ప్రముఖులు తమ జీవితాల్లో యోగా వల్ల కలిగిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పంచుకోవడం స్ఫూర్తిదాయకంగా అనిపించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు, సీనియర్ నాయకులు లక్ష్మణ్, మహేశ్ రెడ్డి, ప్రముఖ సినీ తారలు నవీన్ పొలిశెట్టి, డింపుల్ హయతీ, తదితరులు పాల్గొన్నారు.

