కలం, నిజామాబాద్ బ్యూరో: రైతులు, భూ యజమానుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే (Land Resurvey) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం మాదాపూర్, మెండోరా మండలం వెల్గటూర్ లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు, పట్టాదార్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతిరోజు సగటున 30 ఎకరాల చొప్పున సర్వేను నిర్వహిస్తూ, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, తమ దృష్టికి తేవాలన్నారు. రీ సర్వే వేగవంతానికి అదనంగా అవసరమైన రోవర్ యంత్రాలను సమకూరుస్తామని అన్నారు. రీ సర్వే ప్రక్రియ నిర్వహణలో అలసత్వానికి తావిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ హద్దు, ప్రభుత్వ భూమి, పట్టా భూములకు సంబంధించిన పూర్తి వివరాలు రీసర్వే ఆధారంగా పక్కాగా నమోదు చేయాలన్నారు.
సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహిస్తూ, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించి వేగంగా పరిష్కరించాలన్నారు. రీసర్వే విషయంలో రైతులకు, భూ యజమానులకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ అధికారులు, రైతులు ఉన్నారు.

