కలం, వెబ్ డెస్క్ : జనసేన (Janasena) పార్టీ,పేరు, గుర్తులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఏలూరు, తణుకు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సాగిన ఈ భారీ మోసంలో నిందితుడు సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసి పరారైనట్లు బాధితులు వాపోతున్నారు.
గగర ధరణి అనే వ్యక్తి గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేశాడు. ఆ అనుభవంతో బయటకు వచ్చాక, జనసేన రాష్ట్ర కార్యాలయ నకిలీ లెటర్‌హెడ్లు, పార్టీ గుర్తులు, ప్రముఖ నేతల పేర్లను వాడుకుంటూ నిరుద్యోగులను నమ్మించాడు. జనసేన సీనియర్ నేత కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోటా రుక్మిణి పేర్లను ఈ నకిలీ దందాలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి ఉద్యోగ ఆశావహుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాల్లో కలకలం రేగింది. తన పేరును, పార్టీ గుర్తులను దుర్వినియోగం చేసిన నిందితుడిపై జనసేన నేత కళ్యాణం శివ శ్రీనివాసరావు మంగళగిరి రూరల్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

