కలం, వెబ్ డెస్క్: పెట్టుబడిదారుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (Investment Protection Act) ను ప్రకటించారు. రాజకీయ వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలికాకుండా ఉండేందుకే ఈ చట్టం తీసుకువస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఏపీ రెండో స్థానంలో ఉందన్న చంద్రబాబు.. సామాజిక, ఆర్థిక భద్రతలో కీలక స్థానం దక్కిందని వెల్లడించారు.
పేదల జీవన ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అనుసరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కార్ల యూనిట్ ఓ మంచి ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కూడా కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించినట్లు చెప్పారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉందన్నారు సీఎం.
పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ రోజు నుంచే ఎస్క్రో ఖాతా పని చేయడం ప్రారంభిస్తుందని సీఎం చెప్పారు. ఏపీ తీసుకువచ్చిన ఇన్వెస్ట్ మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (Investment Protection Act ) ను త్వరలోనే దేశం మొత్తం ఆచరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

