కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ (Miryalaguda) మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన కిష్టాపురం శివారులోని అన్నపూర్ణ రైస్‌మిల్లు సమీపంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కొండ్రపోల్ సాత్ తండాకు చెందిన మాలోతు సుజాత, ఆమె కుమారుడు చంటి కలిసి కంటి పరీక్షల నిమిత్తం మిర్యాలగూడ పట్టణానికి వచ్చారు. పరీక్షలు ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా, అన్నపూర్ణ రైస్‌మిల్లు వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు తల్లి మాలోతు సుజాత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు చంటిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను కూడా మృతి చెందాడు.
ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు ఇద్దరూ మరణించడంతో సాత్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కంటి పరీక్షల కోసం వెళ్లిన వారు శవాలై తిరిగి రావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులపై అతివేగంగా వెళ్లే వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

