కలం, స్పోర్ట్స్ : ఆసియన్ గేమ్స్ (Asian Games)లో భారత్‌కు రోయింగ్‌లో కాంస్య పతకం దక్కింది. పురుషుల డబుల్ స్కల్స్ ఈవెంట్లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ మూడో స్థానంలో నిలిచింది. అయితే పతకం గెలిచిన వెంటనే ఇద్దరు ఆటగాళ్లు రోయింగ్ ఫెడరేషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఈవెంట్ షెడ్యూల్లో చివరి నిమిషంలో మార్పులు చేశారని ఆటగాళ్లు ఆరోపించారు. ఆ నిర్ణయం వల్ల స్వర్ణ పతకం అవకాశాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. మొదట ఒక విధంగా జట్లను ప్రకటించి, తర్వాత కాంబినేషన్లు మార్చారని పేర్కొన్నారు.
మొదట పురుషుల సింగిల్స్‌లో అరవింద్ సింగ్, డబుల్ స్కల్స్‌లో నవదీప్ సింగ్-కుల్విందర్ సింగ్, క్వాడ్రుపుల్ స్కల్స్‌లో సత్నామ్ సింగ్ (Satnam Singh), జాకర్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Salman Khan), బల్రాజ్ పన్వార్ ఉండాల్సి ఉంది. తర్వాత మార్పులు చేసి బల్రాజ్ను సింగిల్స్‌కు పంపారు. సత్నామ్-సల్మాన్ జోడీ డబుల్ స్కల్స్‌లో పోటీపడింది. నవదీప్, కుల్విందర్ క్వాడ్రుపుల్ స్కల్స్లోకి వెళ్లారు. పోటీలో సత్నామ్-సల్మాన్ జోడీ 1,500 మీటర్ల వరకు రెండో స్థానంలో కొనసాగింది. చివరి 500 మీటర్లలో మూడో స్థానానికి పడిపోయింది. 6:13.25 నిమిషాల టైమింగ్‌తో కాంస్యం గెలిచింది.
చైనా స్వర్ణం, ఉజ్బెకిస్తాన్ రజతం సాధించాయి. రోయింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాలాజీ మరడప్ప మాత్రం భిన్నంగా స్పందించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా నాలుగు రోజుల షెడ్యూల్‌ను రెండు రోజులకు కుదించాల్సి వచ్చిందని చెప్పారు. విదేశీ కోచ్ ఆంథోనీ ప్యాటర్సన్తో చర్చించిన తర్వాతే మార్పులు చేశామని వివరించారు. భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మరోవైపు, పురుషుల సింగిల్స్ స్కల్స్‌లో బల్రాజ్ పన్వార్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయాడు.

