కలం, మహబూబ్ నగర్ బ్యూరో: “మత్తు వదలండి.. మైదానాలు చేరండి” అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) యువతకు పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం గ్రౌండ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ. 12.53 కోట్ల వ్యయంతో పలు ఆధునిక క్రీడా సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్రీడా కారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్న 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ద్వారా జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అందే అవకాశం కలుగుతుందని అన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవన శైలిని మార్చే శక్తివంతమైన సాధనం అని ఆయన అన్నారు. ప్రతి యువకుడు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి అని అన్నారు.
యువత టైమ్‌పాస్‌గా కాకుండా క్రీడలను సీరియస్‌గా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో స్విమ్మింగ్ పూల్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసి మహబూబ్ నగర్ కు మంజూరు చేసిన ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. వాలీబాల్, కబడ్డీ అకాడమీతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను క్రీడల రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఒలింపిక్ క్రీడలలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించేలా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాబోయే రోజుల్లో దేశంలోనే క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి, రాష్ట్ర క్రీడా సలహాదారులు జితేంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. గతంలో క్రీడలకు రూ.50 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించగా, ముఖ్యమంత్రి మొదటి సారి రూ. 350 కోట్లు కేటాయించి, తరువాత రూ. 640 కోట్లకు పెంచినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ క్రీడల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇప్పటికే వాలీబాల్ అకాడమీ, కబడ్డీ అకాడమీ మంజూరయ్యాయని చెప్పారు. జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అందుకు అవసరమైన 30 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు ఆయన తెలిపారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మహబూబ్‌నగర్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలంలో క్రీడా రంగానికి కేటాయింపు రూ. 300 కోట్లు దాటలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌లోనే రూ.350 కోట్లు, రెండో బడ్జెట్‌లో రూ.468 కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.640 కోట్లు క్రీడా శాఖకు కేటాయించిందని తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి, జాతీయ, ఆసియా, ఒలింపిక్ స్థాయిల్లో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17 నుండి 26 వరకు నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ సందర్భంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలన పై పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , డీవైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

