కలం, తిరుమలగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ మద్దతు ధరకు కొనుగోళ్లు చేపడుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 354 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అదనపు సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
జిల్లాలో 71 రైస్ మిల్లులను కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేయగా, మరో 22 మిల్లులను అదనంగా ధాన్యం సేకరణకు సిద్ధం చేసినట్లు వివరించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కూలీల కొరత ఏర్పడటంతో ధాన్యం ఎగుమతులు, దిగుమతుల్లో కొంత జాప్యం జరిగిందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. లారీల కొరతను అధిగమించేందుకు పోలీసు శాఖ సహకారంతో ఇసుక, సిమెంటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్న లారీలను ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా రవాణాకు మళ్లించినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో కొనుగోలు చేసిన 48 నుండి 72 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు.
భారతదేశంలో యాసంగి వరి ధాన్యంలో 63 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతోందని, వరి ఉత్పత్తి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని జూన్ 4 నాటికి పూర్తిగా తరలించి కొనుగోలు ప్రక్రియను ముగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య, డీఎస్ఓ మోహన్ బాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీవో లాజర్, ఏపీఎం లక్ష్మి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వై. చామంతి-నరేష్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

